సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని గురువారం రైతులు ముట్టడించారు. పోలీసులు అడ్డుకొని గేటు మూసివేయగా రోడ్డుపైనే బైఠాయించి మంత్రి పొన్నం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఆర్డీవో రామ్మూర్తి, సీఐ శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారులు.. యూరియా స్టాకు వస్తుందని, అప్పటివరకు టోకెన్లు తీసుకొని సిద్ధంగా ఉండాలని సూచించడంతో శాంతించిన రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డులో టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నారు.
కామారెడ్డి జిల్లాలో రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఎరువు కోసం రైతులు అరిగోస పడుతున్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసి, రైతులు కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నారు. ఒక్కో రైతుకు ఒకరికి ఒకే బస్తా ఇస్తామని అధికారులు చెప్పగా, వెయ్యి మందికి పైగా వచ్చిన రైతులు కనీసం రెండు అయినా ఇవ్వాలని వేడుకున్నారు. పెద్దఎత్తున క్యూలో నిలబడిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నాట్లు వేసి నెల గడిచిందని, ఎరువు వేయకపోతే పంట చేతికి అందకుండా పోతుందని వాపోయారు. అధికారులు కనిపించరించాలని వేడుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లి పీఏసీఎస్‌లో బుధవారం 94 యూరియా బస్తాలు మాయమయ్యాయి. గురువారం అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా హమాలీలు తీసుకెళ్లినట్టు గుర్తించారు. వారిని విచారించి, డబ్బులు రికవరీ చేసినట్టు తెలిపారు. గోదాము తాళాలు హమాలీల వద్దకు ఎలా వచ్చాయని, కొందరు అధికారులే యూరి యాను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్‌లో ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట రెండు రోజులుగా యూరియా కోసం వేచి ఉన్న రైతులు విసుగుచెంది ఆగ్రహంతో దుకాణంపైకి రాళ్లు విసిరారు. కొంతమంది రైతులు కట్టెలతో వచ్చి ఎరువుల దుకాణం ముందు మంట పెట్టారు. ఇల్లెందు బైపాస్ రోడ్డులోని యూరియా గోదాము లోపలకు దూసుకెళ్లారు. డీఎస్పీ తిరుపతి రైతులతో మాట్లాడి సర్దిచెప్పారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ కొంతమంది రైతులకు యూరియా బస్తాలు అందజేశారు.


