తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో రెండు కేసులను సీబీఐ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు ప్రభుత్వం సిఫారస్సు చేసిన విషయం తెలిసిందే. గతంలో మంథనిలో న్యాయవాద దంపతులను హత్య చేసిన ఘటనకు సంబంధించిన కేసు కూడా సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ రెండు కేసులపై ప్రస్తుతం సీబీఐ విచారణ మొదలు పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సిట్ దర్యాప్తును పరిశీలించడంతోపాటు సాధ్యాసాధ్యాలపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరుతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలో మాజీ అడిషనల్ ఎస్పీ ప్రణీత్‌రావు బృందం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది. దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా ట్రాయ్‌కు తప్పుడు సమాచారం అందించారు. పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖ రాజకీయ పార్టీల నేతల ఫోన్ నెంబర్లనుసైతం ట్యాపింగ్ చేయించినట్లు తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బేరర్లు సహా ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేశారు. వీరి మధ్య జరిగిన సంభాషణలు విన్నట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ మేరకు బండి సంజయ్ సహా రాష్ట్ర బీజేపీ కార్యాలయ బేరర్ల స్టేట్ మెంట్లను సిట్ రికార్డు చేసింది.