ప్రభుత్వ స్థలాల పరిరక్షణ నేపథ్యంలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు… చర్యలు తీసుకునే సమయంలో హడావుడి లేకుండా నెమ్మదిగా పనిచేసుకోలేరా అంటూ బుధవారం హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. ‘ఎలా పడితే అలా వెళతారా? హైడ్రా వాహనాలకు ఆ అసహజ రంగులెందుకు? మీరేమైనా యుద్ధానికి వెళుతున్నారా’ అని నిలదీసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో తమ్మిడిగుంట ఎఫ్ఎఎల్ పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలంలో చెరువు పునరుద్ధరణ పనులపై యథాతథస్థితి కొనసాగించాలన్న ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా పనులు కొనసాగించడాన్ని సవాలు చేస్తూ ఎస్.వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్తో పాటు, రిట్ పిటిషన్ పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.
ఇరుపక్షాలు యథాతథస్థితి కొనసాగించాలని న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణకు పాలడ్పిందని పిటిషనర్ న్యాయవాది తరుణ్ జి. రెడ్డి వివరించారు. పిటిషనర్కు చెందిన స్థలం 6 ఎకరాల్లో ఎలాంటి పనులు చేపట్టబోమని, మిగిలిన ప్రాంతంలో పనులు చేపట్టడానికి అనుమతించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. “కోర్టు ఉత్తర్వుల అమలుపై అధికారులకు లెక్క లేదు. ఏదో ఒక రోజు కోర్టు ఉత్తర్వులంటే ఏమిటో రుచి చూపిస్తాం. కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. హైడ్రా కమిషనర్కు కూడా కోర్టు ఉత్తర్వుల ప్రాధాన్యం తెలుసు” అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
“ఎఫ్ఎఎల్ పరిధిలో నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. ఎఫ్ఎఎల్కు సంబంధించి ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాకాకుండా ఎన్నేళ్లు ఇలా వివాదాలతో కొనసాగిస్తారు? ఒకవేళ ఎల్టీటీఎల్లో ప్రైవేటు పట్టా భూమి ఉంటే భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలి. అలా చేస్తే వివాదాలకు తెరపడుతుంది” అని న్యాయస్థానం సూచించింది.
విచారణ సోమవారానికి వాయిదా పడింది.


