‘ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’
నిజమే! అయితే ఆడవాళ్లు జ్యోతి మాత్రం వెలిగించి ఊరుకుంటే చాలా? అబ్బే! అక్కడితో ఆగితే ఎట్లా? జ్యోతి వెలిగించడం ఎంత పని? కాసింత నూనె, అందులో వత్తి. అసలు వెలిగించాల్సింది వేరే ఉంది. అది వంటింటి పొయ్యి. అది ఆడవాళ్ల హక్కుభుక్తం. ఏదో ఒకనాడు కాసింత టీకో, ఓ ఆమ్లెట్‌కో మగవాళ్లు దాని జోలికి రావాలేమో కానీ, ఆడాళ్ళకు 24 గంటలూ దాంతోనే పని. అదొక అలవాటు. అదొక ఆచారం. అదొక దారుణం. ఎందుకట దారుణం? ఉదయం లేవగానే టీ పెట్టమని అమ్మను అడిగినంత ధీమాగా నాన్నను అడగలేనంత వరకూ అది దారుణమే! అమ్మ వంటింటి రాణి. అమ్మే వంటింటి దాసి. అలాగే మనకు తెలుసు.
2021లో జియో బేబీ దర్శకత్వంలో మలయాళంలో ‘The Great Indian Kitchen’ వచ్చింది. నేను సినిమా చూడలేదు. కథాంశం తెలుసు. ఆడవాళ్లను వంటింటికి పరిమితం చేసిన ఒక సాంఘిక వ్యవస్థపై నిరసన. ఆచారం, అవసరం, అలవాటు, ఆర్థిక లేమి.. ఇలా రకరకాల కారణాలు స్త్రీ వంటింటికి పరిమితమయ్యేందుకు కారకాలవుతాయి. ఫైనల్‌గా ఇవన్నీ పురుషుడి కంట్రోల్‌లోనే ఉంటాయన్నది నిజం. కానీ వ్యవస్థ మూలాలు అలా ఉన్నప్పుడు, జెండర్ కంటే ముందు ఆ మూలాలను నిరసించడం అవసరం.
The Great Indian Kitchen కంటే 25 ఏళ్ల ముందే 1996లో రచయిత్రి కుప్పిలి పద్మ ‘మమత’ అనే కథ రాశారు. సినిమా కంటే చాలా ముందుగానే ఆ స్థితిని ఊహించారు. ఇద్దరు ఉద్యోగస్తులు పెళ్లి చేసుకుంటే ఇంటి అవసరాల కోసం ఉద్యోగం మానేయాలన్న ఆప్షన్ ఆడవాళ్లకే చెందుతుంది తప్పించి, మగవాళ్లకు వర్తించదు. ఎందుకు? మగమహారాజు అన్న బిరుదు, సంపాదనపరుడు అన్న ట్యాగ్ తగిలించుకున్న అతను ఉద్యోగం మానతాడా? ఈ కథలో భార్యే ఉద్యోగానికి లీవ్ పెట్టి వంట పనుల్లో దిగింది. కొన్నాళ్లు అనుకున్నది ఆరు నెలలు గడిచింది. 24 గంటలూ వంట ధ్యాసే! చివరికి భర్తతో పడకటింట్లో కలిసి ఉన్న సమయంలో కూడా తర్వాత రోజు అతనికి ఏం వండాలి అనే ఆలోచనే! అబ్బా! ఏం ఘోరం ఇది? ‘భోజ్యేషు మాత’ అంటే ఈ వంటలక్క జీవితమా?
తెగించింది. తనకేం కావాలో నిర్ణయించుకుంది. ఉద్యోగం చేస్తానంది. భర్త వారించాడు. అడ్డగించాడు. చివరికి బెదిరించాడు. పుట్టింటి బాట పట్టింది. తండ్రి కసురుకున్నాడు. తల్లి బుజ్జగించింది. అన్న వివరం కనుకున్నాడు. వదిన తోడుగా నిలిచింది. భర్త మారడు. మారేలా లేడు. భార్యలు వంటిల్లు దాటి రావడం ఇష్టం లేని అనేకానేక మంది భర్తల్లో అతనూ ఒకడు మరి! కథ ముగిసింది.
సినిమాల్లో చూడండి! హీరో తన అమ్మతో వంటింట్లో ఉండి మాట్లాడతాడు. నాన్నతో హాల్లో ఉండి మాట్లాడతాడు. ఎన్నాళ్ళు అలాగే! ఇదంతా సరే! అమ్మలు వంట చేయొద్దా మరి? చేయొచ్చు. చాకిరీ అనిపించకుండా, తన కష్టాన్ని, ఇష్టాన్ని గుర్తించి ఆదరణ, గౌరవం చూపే చోట అమ్మ తప్పకుండా చేస్తుంది. కానీ నాన్నలను వంటింటి దారి పట్టించడం కావాలి ఇప్పుడు.
~ సాయి వంశి