అమెరికాలో ప్రతిష్ఠాత్మక విశ్వ విద్యాలయం హార్వర్డ్ ఇక నుండి విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వరాదంటూ ట్రంప్ ప్రభుత్వం మే 22న ఆదేశాలు జారీ చేసింది. హార్వర్డ్ వ్యవహారాలపై Department of Home Land Security దర్యాప్తు చేస్తున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని White House వెల్లడించింది. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయేం హార్వర్డ్ కు ఒక లేఖ రాశారు.
విశ్వవిద్యాలయ వ్యవహారాలపై రాజకీయ జోక్యానికి, నిఘాకు అనుమతి ఇవ్వాలంటూ ట్రంప్ ప్రభుత్వం గతంలో చేసిన ప్రతిపాదనలను హార్వర్డ్ విశ్వవిద్యాలయం పాలకమండలి తిరస్కరించింది.
విశ్వవిద్యాలయం పాలకమండలి చైనా కమ్యూనిస్టుపార్టీ తో సంబంధాలు పెట్టుకుంటున్నదని, అమెరికాలో యూదు వ్యతిరేక, ఇజ్రాయిల్ వ్యతిరేక రాజకీయ కార్యాచరణకు హార్వర్డ్ కేంద్రంగా ఉందని ఆమె ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ లో ప్రస్తావించారు. విదేశీ విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్న ట్యూషన్ ఫీజులు రూపంలో లక్షల కోట్ల డాలర్లు సమకూర్చుకుంటున్నారని ఆ నిధులే వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు.
అయితే విశ్వవిద్యాలయానికి రాసిన లేఖలో మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నాటికి విదేశీ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వాలంటే హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోరిన వివరాలను 72 గంటల్లో అందజేయాలని ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ అడ్మిషన్లను వేరే విశ్వవిద్యాలయాలకు మార్చుకోవటం లేదా తమ కోర్సులు పూర్తయ్యేవరకు అమెరికాలో నివసించడానికి ఉన్న చట్టపరమైన హక్కులను కోల్పోవటం జరుగుతుందని హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది.
ఈ చర్య ట్రంప్ ప్రభుత్వపు కక్ష సాధింపు ధోరణిని తెలియజేస్తుందని విశ్వవిద్యాలయ నిర్వహణకు అనేక అవరోధాలు కల్పిస్తుందని హార్వర్డ్ పాలకమండలి ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వ చర్య చట్ట విరుద్ధం. దాదాపుగా 140 దేశాల నుండి అడ్మిషన్స్ కోరే విద్యార్థులకు హార్వర్డ్ ఎప్పుడు తలుపులు తీసే ఉంచుతుంది. తద్వారా అమెరికా ప్రాతినిధ్యం వహించే బహుళ జాతీయ సంస్కృతిని బలోపేతం చేస్తుందని హార్వర్డ్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
ఏప్రిల్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ హార్వార్డ్ విశ్వవిద్యాలయం నవ్యులా టగా మారిందని విమర్శించారు. రాజకీయ నిఘాకు అంగీకరించకపోతే అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పరిశోధన కాంట్రాక్టులను రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ట్రూత్ సోషల్ పేరుతో నడుస్తున్న ట్విట్టర్ అకౌంట్లో చేసిన పోస్టులో హార్వర్డ్ విశ్వ విద్యాలయం అంతర్జాతీయ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల జాబితాలో ఉండకూడదని బోధన సామర్థ్యాలు దారుణంగా పడిపోయాయని వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులను చేర్చుకునే అధికారాన్ని తొలగించేందుకు కూడా వెనకాడమని ట్రంప్ ఏప్రిల్ లోనే హెచ్చరించారు.
విశ్వ విద్యాలయం పాలకమండలి జారీ చేసిన వివరాల ప్రకారం గత విద్యా సంవత్సరంలో ఆరువేలకు పైగా వివిధ దేశాల విద్యార్థులు అడ్మిషన్ పొందారు. మొత్తం యూనివర్శిటీ లో ఉన్న విద్యార్థుల్లో 27 శాతం విదేశీ విద్యార్థులే. కేవలం భారత దేశం నుండే ఏటా 800 మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఈ యూనివర్శిటీ లో అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ లో 788 మంది భారతీయ విద్యార్దులు ఉన్నారు.