లండన్ : స్కూల్ బాయ్ జిమ్మీ మిజెన్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జేక్ ఫహ్రీకి బ్రిటన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. అతడిని తక్కువ భద్రత ఉండే ‘ఓపెన్ ప్రిజన్’కు తరలించాలని పరోల్ బోర్డు చేసిన ప్రతిపాదనను ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డేవిడ్ లామీ తిరస్కరించారు. తన నేరం గురించి ర్యాప్ పాటలు పాడుతూ గొప్పలు చెప్పుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ప్రజల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎందుకు ఈ నిర్ణయం?
హంతకుడు జేక్ ఫహ్రీ (36) గతంలో విడుదలైన సమయంలో “Ten” అనే పేరుతో డ్రిల్ మ్యూజిక్ చేస్తూ, అందులో తను చేసిన హత్య గురించి ప్రస్తావించాడని ఆరోపణలు వచ్చాయి. యూట్యూబ్, స్పాటిఫై వంటి వేదికల్లో ఈ పాటలు అందుబాటులోకి రావడంతో బాధితుడి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు 2025 జనవరిలో అతడిని మళ్లీ జైలుకు పంపారు. అయినప్పటికీ పరోల్ బోర్డు అతడిని ఓపెన్ ప్రిజన్ కి పంపవచ్చని సూచించగా, డేవిడ్ లామీ ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నారు.
ఆనాటి దారుణ హత్య
2008లో సౌత్ లండన్‌లోని ఒక బేకరీలో 16 ఏళ్ల జిమ్మీ మిజెన్పై జేక్ ఫహ్రీ దాడి చేశాడు. ఒక గ్లాస్ డిష్‌ను విసరడంతో అది పగిలి జిమ్మీ గొంతులోని రక్తనాళాలను కోసేసింది. ఈ ఘటనలో జిమ్మీ మరణించగా, 2009లో ఫహ్రీకి కనీసం 14 ఏళ్ల శిక్షతో కూడిన జీవిత ఖైదు పడింది.
మారలేదు హంతకుడి ప్రవర్తన
జేక్ ఫహ్రీ తను చేసిన నేరానికి ఏమాత్రం పశ్చాత్తాపం చెందలేదని జిమ్మీ తల్లి మార్గరెట్ మిజెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“పరోల్ బోర్డు సిఫార్సు విన్నప్పుడు నేను షాక్‌కు గురయ్యాను. వాడు అస్సలు మారలేదు. న్యాయశాఖ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే” అని ఆమె పేర్కొన్నారు.
మొదట ఆ పాటలకు తనకు సంబంధం లేదని బుకాయించిన ఫహ్రీ, ఆ తర్వాత తనే ఆ పాటలు పాడినట్లు అంగీకరించాడు. ప్రజల భద్రతకే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఇలాంటి నేరస్తులకు వెసులుబాటు కల్పించే ప్రసక్తే లేదని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ప్రతినిధి స్పష్టం చేశారు.


