గోకర్ణ (కర్ణాటక) సమీపంలోని రామతీర్థ హిల్స్‌లో గుహలో రహస్యంగా జీవనం సాగిస్తున్న 40 ఏళ్ల రష్యన్ మహిళ నీనా కుటినా, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలు (6 మరియు 4 సంవత్సరాల వయస్సు)ను జూలై 9, 2025న గోకర్ణ పోలీసులు కనుగొని రక్షించారు. నీనా 2016లో బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చింది, కానీ ఆమె వీసా 2017లో గడువు ముగిసింది. ఆమె గోవా నుండి గోకర్ణకు వచ్చి, దాదాపు రెండు వారాల పాటు ఈ గుహలో నివసించింది. ప్రకృతితో సన్నిహితంగా జీవించడానికి, ధ్యానం, పూజలు చేయడానికి ఇష్టపడింది.
ఆమె తన కుమార్తెలతో కలిసి సాధారణ జీవనం గడిపింది. గుహలో రుద్ర విగ్రహాన్ని ఉంచి పూజలు చేసేది. పోలీసులు గుహ వద్ద ఆమె పాస్‌పోర్ట్, గడువు ముగిసిన వీసా డాక్యుమెంట్లను కనుగొన్నారు. నీనా తన జీవన శైలిని సమర్థిస్తూ, తాము సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నామని, ప్రకృతిలో జీవించడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పింది. ఆమె తన కుమార్తెలకు కళలు, చదువు, రాయడం వంటి పాఠాలు నేర్పించేది . గుహ సమీపంలోని గ్రామం నుండి సరుకులు కొనుగోలు చేసేది.
అయితే, వీసా గడువు ముగియడం వల్ల ఆమెను, ఆమె కుమార్తెలను రష్యాకు డిపోర్ట్ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇది బహుశా ఒక నెల సమయం తీసుకోవచ్చు. ప్రస్తుతం వారు కర్వార్‌లోని మహిళల రక్షణ కేంద్రంలో ఉన్నారు, మరియు బెంగళూరులోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా డిపోర్టేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాము ప్రకృతిలో ఆనందంగా, ఆరోగ్యంగా బతుకుతుంటే తమను మురికికూపంలోకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని, కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారని ఆవేదనగా తెలిపింది. నీనా తన జీవన శైలిని గురించి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ, తాము 20 దేశాలలో అడవుల్లో జీవించామని, ఇది తమ ఆరోగ్యానికి మేలు చేసిందని పేర్కొంది. తాను నలుగురు పిల్లలకు గుహలోనే జన్మనిచ్చినట్లు తెలిపింది.