వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల శ్రీ సత్య సాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఒక సభలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పోలీసులను తెలుగుదేశం పార్టీకి వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పోలీసుల యూనిఫార్మ్‌లను తీసివేస్తామని హెచ్చరించారు. అలాంటి పోలీసుల గుడ్డలూడదీయిస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. “ఎల్లకాలమూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారంలో వుంటుందని అనుకోవద్దు. ప్రతి పోలీసు అధికారికీ చెబుతా వున్నాను. చట్టం ముందు దోషులుగా నిలబెట్టి, మీ యూనిఫారాలు తీయించి, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామ”ని తమ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య హెచ్చరించారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు అధికారుల సంఘం నుండి తీవ్ర ప్రతిస్పందనను తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పోలీసుల సమర్థతను, నిబద్ధతను అవమానించే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలను ఖండించారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక, రామగిరి సబ్-ఇన్‌స్పెక్టర్ సుధాకర్ యాదవ్ కూడా జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసు యూనిఫార్మ్‌లు కఠిన శిక్షణ, పరీక్షల ద్వారా పొందినవని, వాటిని ఎవరు తీసివేయలేరని స్పష్టం చేశారు. తేలిగ్గా ఊడదీయడానికి అవి అరటితొక్కలు కాదని అన్నారు. ఆయన తన వీడియోలో జగన్ని ఏకవచనంతో సంబోధిస్తూ ఒకింత పరుషంగానే స్పందించారు.
ఇక, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసులను అవమానించే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల కోసం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి, జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, పోలీసు శాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు జగన్ అంత తీవ్ర స్వరంతో కాకున్నా తెలంగాణలో కేటీఆర్ కూడా తాము తిరిగి అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్న పోలీసుల్ని గుర్తు పెట్టుకుంటామని, వడ్డీతో సహా ఇస్తామని హెచ్చరిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పల్లకి మోసి తమ పనులు చేయించుకునే అధికారులు అన్ని శాఖల్లో వున్నట్లే పోలీసు శాఖలోనూ వుంటారు. అన్ని శాఖల్లో నిజాయితీపరులున్నట్లే పోలీసుల్లోనూ నిజాయితీపరులుంటారు. ఎటొచ్చీ వీరి పరిస్థితే “కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకి కోపం” అన్న చందాన తయారవుతుంది. అయితే అధికారంలో వున్నవారు తమ కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవడానికి పోలీస్ శాఖని ఉపయోగించుకుంటారు. ప్రతిపక్షంలో వుండి అధికారం కోసం ఎదురుచూస్తున్న పార్టీ కూడా తమని పోలీసులు అడ్డుకోకూడదని వారిని హెచ్చరిస్తుంటారు, భయపెడుతుంటారు. ఈ క్రమంలో వచ్చినవే ‘రెడ్ బుక్’, ‘రాజారెడ్డ్డి బుక్’. ఈ ‘బుక్స్’ ని పట్టించుకోకుండా పోలీస్ ఫైల్స్ ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి!
Add A Comment