పర్యావరణపరంగా అడవికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆ భూమికి ఉన్నాయి. TGIIC వివరాల మేరకు 122 ఎకరాల్లో చెట్లను పూర్తిగా వేర్లతో సహా కొట్టేశారు” అని నివేదికలో CEC స్పష్టం చేసింది. వాల్టా చట్టం 2004 ప్రకారం కొన్ని మినహాయింపులున్న చెట్లను కొట్టివేయాలంటే సెల్ఫ్ డిక్లరేషన్‌తో కొట్టివేయొచ్చు. ఇందుకు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌కు ఫారం 13ఏ ఇచ్చి, నిర్దేశిత ఫీజు చెల్లిస్తే సరిపోతుందని అటవీ శాఖాధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
CEC మొత్తం 69 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. ఇందులో కంచ గచ్చిబౌలి భూములకు ‘అడవి’ అని చెప్పడానికి కావాల్సిన గుణం ఉందని స్పష్టం చేసింది. ”ప్రాథమిక పరిశీలన ప్రకారం, ఆ ప్రాంత సహజ లక్షణం, పర్యావరణ పరంగా అడవిని తలపిస్తోంది” అని నివేదికలో పలుమార్లు ప్రస్తావించింది. ”ఈ ఏడాది మార్చి 4న అటవీ లక్షణాలు కలిగిన భూములు గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా చదును చేసే పనులు చేపట్టారు. వన చట్టం 2023ను పట్టించుకోకుండానే టీజీఐఐసీ చదును చేసే పనులు మొదలుపెట్టింది” అని CEC తన నివేదికలో పేర్కొంది. అలాగే TGIIC కూడా డీపీఆర్ సిద్ధం చేయకుండా నేరుగా అడవి వంటి లక్షణాలు కలిగిన ఆ భూమిని చదును చేయడానికి ముందుకెళ్లిందని సీఈసీ అభిప్రాయపడింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1975లో దాదాపు 2324 ఎకరాలను కేటాయించింది . విశాలమైన ప్రాంతం కావడంతో ఇదంతా పచ్చదనం, చెట్లతో నిండి ఉంటుంది. జింకలు, నెమళ్లు కనిపిస్తుంటాయి. CEC తన నివేదికలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ” ఈ ప్రాంతం పర్యావరణం, పచ్చదనం పరంగా ఉన్నతంగా ఉంది. రాళ్ల అమరికలు, కుంటలు, జీవవైవిధ్యం కారణంగా అక్కడ ఏదైనా పనులు చేయాలంటే కచ్చితంగా గట్టి పరిశీలన జరగాలి. అటవీ చట్టాల ప్రకారం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడమైనా సరే, నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.
TGIIC తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ, అన్ని అనుమతులూ తీసుకోలేదు. భూమిని మార్టిగేజ్ చేయడం కూడా ఆర్థికంగా తీవ్రమైన ఉల్లంఘనగా భావించాలి” అని చెప్పింది.ఈ భూమిని బేకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ పేరుతో మార్టిగేజ్ చేసి నాన్-కన్వర్టబుల్ బాండ్లు జారీ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ 10న సీఈసీకి ఇచ్చిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
ఈ భూములపై CEC తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది.
సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి పనులూ మొదలుపెట్టకూడదు. క్షేత్రస్థాయి అటవీ శాఖాధికారులు, వన్యప్రాణుల నిపుణులు, పర్యావరణవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే సంస్థ ప్రతినిధులతో కమిటీ వేసి అటవీ తరహా ప్రాంతాలను గుర్తించాలి. ఈ నేపథ్యంలో TGIIC అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. TGIICకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రద్దు చేయాలి. వివాదాస్పద 400 ఎకరాలు సహా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాన్ని పర్యావరణ సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో సమగ్ర అధ్యయనం చేయించే వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు జరగకుండా నిరోధించాలి.
ఫారం 13ఏ కింద తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిన TGIIC తో పాటు భారీగా చెట్లను కొట్టేసిన కాంట్రాక్టరుపై గట్టి చర్యలు తీసుకోవాలి. అందుకు వాడిన యంత్రాలను జప్తు చేయాలి. ప్రాథమికంగా భూయాజమాన్య హక్కులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నట్లుగా తెలుస్తోంది. TGIIC చెబుతున్నట్లుగా హక్కుల బదలాయింపు పూర్తయ్యిందా.. లేదా అనే విషయంపై లోతైన పరిశీలన జరగాలి. యాజమాన్య హక్కుల గురించి సుప్రీంకోర్టులో తేలే వరకు, భూములను మార్టిగేజ్ చేయడం, లీజు, వాణిజ్య అవసరాలకు వినియోగించడంపై స్టే ఇవ్వాలి.


