
ఆత్మహత్యలన్నీ సమాజం చేసిన హత్యలే అనడంలో నిజం వుండొచ్చు. కానీ కొంతమంది మరి కొందరిని హత్య చేసి మరీ ఆత్మహత్య చేసుకుంటారు. దీన్ని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని, సామూహిక ఆత్మహత్యలనీ మీడియా వక్రీకరించి రాస్తుంది. కుటుంబ పెద్దకి తీర్చలేని అప్పులేవో వుంటాయి. లేదా నయం కాని వ్యాధి ఏదో బాధ పెడుతుంటుంది. అతనికి బతుకు మీద విరక్తి పుడుతుంది. భార్యని ఎలాగో ఒప్పిస్తాడు ఆత్మహత్యకి. కొన్ని సందర్భాల్లో భార్య ఒప్పుకోదేమోనని భయంతో ఆమెకి ఏ మత్తు మందో ఇచ్చి లేదా మరో రకంగానో చంపేస్తుంటాడు భర్త. (ఇలా ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది) పిల్లలకి చెప్పేదేముంది? వాళ్లని పుట్టించారు కాబట్టి వాళ్లని చంపే హక్కు కూడా తల్లిదండ్రులకు వుంటుందనుకుంటారు. ఈ సోమవారం హైదరాబాద్ లో అలాంటి దారుణమే జరిగింది.
కల్వకుర్తికి చెందిన చంద్రశేఖరరెడ్డి ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. కొన్నాళ్ల నుండి ఆయన ఖాళీగా వున్నాడు. కుటుంబం ఆర్ధిక కష్టాల్లో పడింది. అతని ఆరోగ్యం పాడైంది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాడు. ఒక్కడే ఆత్మహత్య చేసుకుంటే అయ్యో పాపం అనుకోవచ్చు. కానీ 15 ఏళ్ల కుమార్తె శ్రీతరెడ్డికి ఉరేసి, పదేళ్ల కుమారుడు విశ్వాస్ రెడ్డికి విషమిచ్చి చంపేసి, ఆనక 35 ఏళ్ల భార్య కవితతో కలిసి 44 ఏళ్ల చంద్రశేఖరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి ఎవరూ కారణం కాదని, అనారోగ్యంతో బాధపడుతున్నానని, కెరీర్ పరంగా, శారీరిక మానసిక సమస్యలున్నాయని, అందువల్ల చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మరీ ఈ ఘాతుగానికి పాల్పడ్డాడు చంద్రశేఖరరెడ్డి. ఈ సమస్యలతో పిల్లలకేం సంబంధం అనే ప్రశ్న వెంటనే వస్తుంది.
ఇలాంటి స్వీయ హంతకులు తామొక్కళ్లే పోకుండా, హంతకులుగా మారి ఇతరుల్ని చంపి మరీ ఎందుకు ఛస్తారంటే దానికో బలమైన కారణముంది. తను కుటుంబ పెద్దని కనుక, తాను లేకపోతే కుటుంబం ఎలా బతుకుతుందో, పిల్లల్ని ఎవరు చూస్తారో ఏమో, వాళ్లు అనాధలవుతారేమో అనే కారణాలుంటాయి వీళ్లకి. అనాధత్వం కంటే చావు బెటర్ అనుకుంటారు. ఆడపిల్లలున్న కుటుంబంలోనే ఇదెక్కువ కనబడింది నాకు. చస్తూ కూడా అభద్రతాభావాలతోనే పోయే వాళ్లెంతమందో!
పేరెంటింగ్ అంటే ఓ బాధ్యతగా కాకుండా పిల్లల మీద ఓ హక్కుగా భావించే తల్లిదండ్రులే అధికం మన సమాజంలో. పిల్లల బతికే హక్కు కంటే వాళ్ల బతుకుల్ని శాసించే తమ హక్కే పెద్దదనుకుంటారు చంద్రశేఖర్ రెడ్డి వంటి మూర్ఖులు. పిల్లలు, కుటుంబమూ తన స్వంతం అనుకోవడం పిత్రుస్వామిక భావజాలమే. తన జీవితం మీద తనకి విరక్తి పుడితే అర్ధం చేసుకోవచ్చు. కానీ మిగతా కుటుంబ సభ్యులు జీవించాలా లేదా మరణించాలా అనే ఆ అధికారం ఎవరిచ్చారు అతనికి? తాను పోతే వాళ్లెట్లా బతుకుతారు అనుకున్నప్పుడూ తానే ఎలాగోలా బతకడానికి నిర్ణయించుకోవాలే కానీ వాళ్ల ప్రాణాలు తీసే హక్కెక్కడిది? ఎక్కడిది అంటే అది పైన చెప్ప్పినట్లు పిత్రుస్వామిక సమాజం నుండి వచ్చిందే.
పిల్లల్ని కనడం కోసమే ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. తల్లిదండ్రులు జన్మనిచ్చే మహానుభావులంటారు కానీ జీవితానికి ఓ తోడు కోసం, ప్రాకృతిక అవసరాలు తీర్చుకోవడం కోసం, ఒక కుటుంబంగా సమాజంలో హోదాని అనుభవించడం కోసం పెళ్లిళ్లు చేసుకుంటారు. పిల్లలు పుట్టగానే సంసార జీవితాన్ని వదులుకోరుగా? తమ సౌఖ్యం, ప్రతిష్ట కోసం పిల్లల్ని పుట్టించి వారి జీవన్మరణాలపై జెండా పాతడం దారుణం కాదూ?
పదిహేనేళ్లు వచ్చాయంటే జీవితం మీద ఓ అవగాహన ఏర్పడే వుంటుంది కుమార్తె శ్రీతరెడ్డికి. పాపం ఆ పదిహేనేళ్ల పిల్ల భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కని వుంటుందో! డాక్టర్ అవాలనుకున్నదేమో. క్రీడాకారిణి కావాలనుకున్నదేమో. ఎమ్మెస్ కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నదేమో. తల్లిదండ్రులే చావు రూపంలో మీద పడి ఉరేస్తుంటే పాపం ఎంత విలవిల్లాడి వుంటుందో ఆ బిడ్డ! పదేళ్ల విశ్వాస్ రెడ్డికి ఎలా విషం ఇవ్వ బుద్ధైందో ఆ కర్కోటక తల్లిదండ్రులకు? పోయినోళ్లందరూ గొప్పోళ్లు కారు. కడుపున పుట్టిన బిడ్డల్ని చంపి పోయే హంతక ఆత్మహతులైతే అస్సలుకే మంచోళ్లు కాదు.
అంతగా బతకలేం, చనిపోవాల్సిందే అని నిర్ణయించుకుంటే “దయచేసి మానవతామూర్తులెవరైనా మా పిల్లలని కాపాడండి. వారి బాగోగులు చూడండి.” అని సూసైడ్ నోట్ లో రాసి పోతే ఈ సమాజంలో ఆ పిల్లల్ని చేరదీసే వారుండరా? తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్ద / సంపాదించే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనే భరోసా ప్రభుత్వం వైపు నుండి వస్తే ఆత్మహత్యల పేరుతో పిల్లల హత్యలు ఆగొచ్చు. అసలు ఆత్మహత్యల నివారణకి ప్రభుత్వం నిర్వహిస్తున్న చైతన్య కార్యక్రమాలు సున్నా అని కూడా మనం గమనించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.
వ్యక్తుల్ని తప్పు పట్టడంతో మనం ఆగిపోతే అది మన లోపమే. ప్రతి ఆత్మహత్య వెనుక వ్యవస్థ వుంటుంది. వ్యవస్థలో వున్న వాళ్లందరూ సుఖపడుతున్నారని కాదు కానీ ఆ వ్యవస్థలో మనమూ వున్నాము. ఆత్మహత్యలు చేసుకునేవారిలో వెంటాడే ఒంటరితనం వుంటుంది. ఏ మద్దతూ దొరకని వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కుటుంబాలుగా చనిపోవడం ఈ మధ్యన ఎక్కువైంది. వీళ్లు ఎవరితోనూ కలిసేవారుగా వుండరు. బలహీన మానవ సంబంధాలు జీవితానికి అవసరమైన ధైర్యాన్నివ్వవు. భరోస కల్పించవు. ఒకరి మీద మరొకరికి పెత్తనాలకు తావులేని బలమైన మానవ సంబంధాలే ఆరోగ్యకరమైన కుటుంబాల్ని, సమాజాల్ని నిర్మించగలవు.


