హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ 1 (31 అర్ధరాత్రి) నుండి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, APలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉండనున్నాయి.
యాదాద్రి జిల్లా దండుమల్కాపురం నుంచి APలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను GMR గుత్తేదారు సంస్థ రూ.1,740 కోట్లతో BOT పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబరులో టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు ఆ సంస్థ టోల్ వసూళ్లు మరియు రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గతేడాది జులై 1 నుండి టోల్ వసూళ్లను NHAI ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. GMR సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు NHAI టోల్ వసూళ్లను చేపడుతున్నందున టోల్ రుసుములను తగ్గించే నిర్ణయం తీసుకుంది.


