ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందు బహిష్కరణలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడతో పాటు పలుచోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలు, ఉద్యమం చేపట్టాయి. నిన్న శుక్రవారం మసీదులకు నల్ల రిబ్బన్లతో హాజరై నిరసన తెలపాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు సఫలమైంది.
ఈ సందర్భంగా, ఏలూరులో గిరిజన భవనంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు హాజరుకాలేదు. జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్, TDP నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డ్‌లో కేంద్రప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించరని, అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి సెల్వికి తెలిపారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తాము 10 మంది వచ్చామని చెప్పారు.
కేంద్రం పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు NDA మిత్రపక్షం, TDP మద్దతు చేస్తున్నందుకు నిరసనగా, అఖిల భారత ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు ఎక్కడికక్కడ ఇఫ్తార్ విందుల్ని ముస్లింలు బహిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతీ జిల్లాకేంద్రాల్లోనూ రంజాన్ సందర్భంగా ఇస్తున్న ఇఫ్తార్ విందులు ముస్లింలు రాక వెలవెలబోతున్నాయి. దీంతో TDPకి చెందిన ముస్లిం నేతలు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.


