ఆస్తి కోసం కుమార్తెను చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన షీనా నాయక్‌కు కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె మహేశ్వరి ఉన్నారు. మహేశ్వరి(26) Bsc Nursing పూర్తి చేసింది. భార్య అనారోగ్యంతో మృతి చెందటంతో పీనా నాయక్ లలిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. మహేశ్వరికి పెళ్లవగా, భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయి పుట్టింట్లోనే ఉంటోంది. మహేశ్వరికి మళ్లీ పెళ్లి చేయాలని, ఉన్న రెండు ఇళ్లలో ఓ ఇంటిని ఆమెకు ఇవ్వాలని తండ్రి నిర్ణయించాడు. అయితే ఉన్న రెండు ఇళ్లూ తనకు పుట్టిన బిడ్డకే దక్కాలనే పథకంతో మహేశ్వరి హత్యకు లలిత పథకం వేసింది.
దీంతో ఆస్తి పోతుందని సవతి తల్లి లలిత, తన మరిది CRPF జవాన్ బానోత్ రవి, అతడి స్నేహితుడు వీరన్న కలిసి మహేశ్వరిని చంపాలని పథకం వేశారు. గత యేడాది డిసెంబరు 7వ తేదీన ఉద్యోగ పనులపై పీనా నాయక్ బయటకు వెళ్లిన సమయం చూసి ఈ ముగ్గురు కలిసి మహేశ్వరిని నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి వద్ద మూసి నదిలో పూడ్చిపెట్టారు.
పీనా నాయక్ తిరిగి ఇంటికి రాగానే కుమార్తె వేరే అతనితో వెళ్లిపోయిందని నమ్మబలికారు. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భార్య చెప్పింది. దీంతో పీనా నాయక్ మిన్నకుండిపోయాడు. అయితే, కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు నెలలు అయినా కుమార్తె జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా అసలు విషయం బహిర్గతమైంది. మహేశ్వరిని ఆస్తి కోసం హత్య చేసినట్టు లలిత అంగీకరించారు. దీంతో ఈ హత్య కేసులోని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


