Friday, 7 August 2026

అమ్మతనాలు – కనబడని సంకెళ్ళు!

మనకి అమ్మంటే ఒక దేవత. ఓ మహా త్యాగమూర్తి. తనకంటే ఓ ఐదు, పదేళ్ళు చిన్నవాడు కనబడగానే “నువ్వు నా బిడ్డలాంటివాడివి నాయనా” అని ఆమె కళ్ళు చెమర్చాలి. లోకంలో అనేకమంది ఆమెని చూసి “అబ్బా! అమ్మంటే ఇలా ఉండాలి” అనుకునేలా అమ్మయివుండాలి. తన కడుపు మాడ్చుకోకపోతే ఆమె అమ్మే కాదు. కొవ్వొత్తుల్లా తగలబడి పోవాలి. ఆమె చీపురుకట్టై ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పొయ్యి మీద అన్నం గిన్నై ఉడికిపోవాలి. ఎందుకిదంతా చేయాలి? అసలెందుకిలా అవ్వాలి? ప్రకృతిలోని ఏ జీవజాతికీ లేని సహజాతేతర భావజాలపు మాతృత్వం స్త్రీలకి ఎందుకు అంటగట్టాలి?

వర్తమాన అధునాతన జీవితంలో తన ఇరవైల్లో, ముప్ఫైల్లో వున్న ఆమె కూడా మగాడంతా బిజీ అయిపోయి కుటుంబానికి ఒక ఆర్థికావలంబనం అయినందువల్ల తిట్టించుకొనో, ఈసడించుకోబడో పని వాళ్ళను పెట్టుకొనో, కర్రీ పాయింట్ మీద ఆధార పడో కొన్ని చోట్ల, కొంతవరకు ఇంటి పని నుండి రిలీఫ్ (దీన్నే అవుట్ సోర్సింగ్ ఆఫ్ మదర్ హుడ్ అని వెటకారంగా కూడా చెబుతున్నారు) పొందుతున్నారేమో కానీ ఇదే వర్తమానంలో నలభైలు, యాభైల్లో ఉన్న స్త్రీల మీద మాత్రం సమాజం ఇప్పటికీ కొవ్వొత్తి సిద్ధాంతం, అమ్మతనపు గొప్పదనాల భావజాలాల బ్లాక్ మెయిలింగ్ నిరాఘాటంగా అమలు చేస్తున్నది. సమాజం అంటే ఎవరు? మన కడుపున పుట్టినవాళ్ళు, తోబుట్టువులు, తల్లి, తండ్రి, పక్కింటివాళ్ళు, సహోద్యోగులు! ఏదో రూపంలో మనతో మానవసంబంధం ఉన్నవాళ్ళే సమాజం అంటే. మనం మనవాళ్ళకే ఎందుకు భయపడతామంటే, మన మానావ సంబంధాలన్నీ త్యాగాన్నే డిమాండ్ చేస్తాయి. ఇది స్త్రీల విషయంలో, మరీ ముఖ్యంగా అమ్మల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. తల్లి బిడ్డకి, భార్య భర్తకి చేసేది త్యాగమా అన్న ప్రశ్నలకేమీ తక్కువుండవు కానీ ఆ త్యాగాలలో ఎంతవరకు స్వీయ నిర్ణయంతో చేయబడి వుంటాయనేది ముఖ్యం. అవి సంతోషంగా స్వీకరించబడేవా లేక రుద్దబడేవా అనేది చూస్తే సత్యం బోధపడుతుంది.

సమాజం అమ్మల నుండి ఏయే త్యాగాలు ఆశిస్తున్నది? భర్త చనిపోతేనో, విడాకులు తీసుకుంటేనో, లేదా దూరంగా ఉంటేనో మిగతా వాటితో పాటు స్త్రీ చేయాల్సి వస్తున్న అతి పెద్ద త్యాగం ఒక రెగ్యులర్ తోడు నుండి దొరికే లైంగిక తృప్తి. పాత కాలపు తల్లులు చిన్న వయసులో విధవరాళ్ళైతే లేదా మొగుడు కొంపొదిలి పారిపోతే లేదా తాగుమోతోడై చేవచచ్చి పోతే…ఇది మా ఖర్మ అనుకొని అంతరంగాన అగ్నిజ్వాలల్ని భరించేవారు. అసలు వారి గురించి ఏ మాత్రం, ఏ కొంచెమైనా మరో రకంగా ఆలోచించటమంటే అది అనైతికమే. సహజమైన కోరికల్ని ఇలా నైతిక విలువల పేరుతో భయపెట్టడాన్ని లేదా వాటిని కోల్పోవటం ఒక గొప్ప త్యాగమని కీర్తించటాన్ని మోరల్ టెర్రరిజం లేదా తెలుగులో చెప్పాలంటే నైతిక ఉగ్రవాదం అని అంటాన్నేను. అర్థరాత్రి వరకు సమయాన్ని డిమాండ్ చేసే బిజినెస్ లేదా ఉద్యోగులై ఉండి పార్ట్ టైం బిజినెస్ లేదా సరదాతత్వపు స్నేహాల వల్ల బైట వ్యాపకాలతో లేదా తనదైన ఆసక్తుల్ని పెంపొందించుకోవటం వల్ల పురుషులు బైట ఎక్కువ సమయం గడిపి స్త్రీ తోడుకి, లైంగిక తృప్తికి ప్రత్యామ్నాయాలు ఏర్పరుచుకుంటారు. కలిసి జీవిస్తున్నా ఇటువంటి సందర్భాలలో స్త్రీలు లైంగిక వాంఛల త్యాగం చేయాల్సి వస్తుంది. మనందరి దృష్ఠిలో అమ్మల త్యాగం అంటే కష్టాలు పడి పిల్లల్ని పెంచుకోవటమే. ఏ జీవజాతికి చెందిన తల్లైనా తన బిడ్డలకి ఆహారం అందించి, సంరక్షించుకొని, ఆహార అన్వేషణలో తర్ఫీదునిస్తుంది. కానీ లైంగిక తృప్తిని కోల్పోదు. ఒక్క మనిషి విషయంలో మాత్రమే ప్రకృతి విరుద్ధంగా జరుగుతుంది. “ఇంక మనిషికి జంతువుకి తేడా ఏముంటుంది?” అనేవాళ్ళు మనిషి కూడా మౌలికంగా జంతువనే విషయం మర్చిపోతుంటారు. అర్థం పర్థం లేని సన్యాసాలు, అస్ఖలిత బ్రహ్మచర్యాల్ని ఆధ్యాత్మిక విలువలుగా ప్రచారం చేసి ఆ తరువాత లైంగిక వాంఛని అనైతిక విషయంగా దాడి చేస్తుందీ సమాజం. అమ్మలకి లైంగిక వాంఛలుంటాయంటే, అవి తీరాలంటే ఉలిక్కి పడిపోతారు. అది చాలా సహజమైన విషయమంటే ఇదెక్కడి విడ్డూరమని గగ్గోలు పెడతారు.

మొగుడు నుండి వేరైపోయి అక్క పిల్లల్నో, తమ్ముడి పిల్లల్నో, అన్న పిల్లల్నో చూసుకుంటూ, తల్లిదండ్రుల సేవలు చూసుకుంటూ జీవితాలు గడిపేస్తున్న పిల్లల్లేని ఒంటరి మహిళలు అనేకమంది. బాల్య వివాహాల వల్ల పసి వయసులోనే సిద్ధం కాని శరీరాలతో గర్భం దాల్చి ప్రసూతి మరణాల పాలైన చిన్న వయసుల తల్లుల విషాదంతో పోల్చదగ్గదే వీరిది కూడా. విద్య, ఉద్యోగం, ధనార్జన ఉండి కూడా స్త్రీ-పురుష సంబంధాలలో మానవీయత లోపించిన కారణంగా ఏర్పడిన అభద్రత వల్ల నిస్సారమైన జీవితాన్ని అనుభవించే వారే వీళ్ళంతా. దంపతీ సంబంధాల బైట కూడా పితృస్వామ్య భావజాల దాష్టీకం ఇందుకు కారణం కాదూ? ఇప్పుడున్న తరమే చివరి బాధామయ తరం కావాలని ఆశిద్దామా?

ఏ చర్చా కూడా వ్యక్తిగత సమస్యలకి పరిష్కారం కాజాలదు. ఒక విషయం మీద ఫోకస్ చేయటం మాత్రమే చర్చ చేయగలదు. ఆరోగ్య సమస్యలకి చెప్పినంత సులువుగా మానవ సంబంధాలు, ఘర్షణలు, నమ్మకాలు, సంప్రదాయాలకి సంబంధించిన విషయాల్లో సలహాలు పనిచేయవు. ఇక్కడ ప్రస్తుతం మనం చర్చిస్తున్న విషయానికి రెండు బలమైన విరుద్ధ కోణాలున్నాయి. రెండూ సబబుగానే కనబడతాయి. ఒంటరి స్త్రీలు (అవివాహితులు, డైవోర్సీలు, విడోస్ వగైరా, – ముఖ్యంగా తల్లులు) మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా, ఎటువంటి చట్టబద్ధ సంబంధం లేకుండా లైంగికతృప్తిని పొందొఛ్చా అనేది ఒకటి. అనేకానేక కారణాల వల్ల, తాము అనుభవించిన సంక్షోభం వల్ల, చూసిన ఉదంతాల వల్ల మళ్ళీ పెళ్ళికి సిద్ధం కా(లే)ని స్త్రీలు లైంగిక వాంఛల్ని అణచి పెట్టుకోవాల్సిందేనా? “పెళ్ళంటే పెత్తనం, దాంపత్యమంటే ఆత్మగౌరవానికి భంగకరం. సంసారమంటే హింస” అని తమ అనుభవాల వల్ల భావించే స్త్రీలు తమ జీవితాన్ని అలా అసంతృప్తితో గడపవలసిందేనా అంటే అవును అలాగే గడపాలి అని కరుడు కట్టిన సంప్రదాయ వాదులు మాత్రమే చెప్పగలరు. (ఏమోలే మార్క్సిజాన్ని కల్ట్ స్థాయికి దిగజార్చే నైతికవాదులు కూడా ఔననొచ్చేమో). ఐతే సూత్రప్రాయంగా అంగీకారం వెలిబుచ్చినంత తేలిక కాదు పెద్ద మనసు చూపించటం. ఎందుకంటే అంగీకరించిన విషయాలన్నింటినీ ఆచరిస్తామన్న గ్యారెంటీ లేదు. మనలో ద్వంద్వ ప్రమాణాల పట్ల చూసీచూడనట్లు పోయే తత్వం భయంకరంగా ఉంది. ఆ ఒంటరి స్త్రీలు కూడా ఆలోచించినంత తేలికగా ముందడుగు వేయలేరు. వేల సంవత్సరాల కరడు కట్టిన సంప్రదాయాలతో కునారిల్లిన సంస్కృతిని, వ్యవస్థని ఎదిరించటం అంత తేలిక కాదు. మరో బలమైన కోణమేమిటంటే పిల్లలు, వారి భవిష్యత్తు మీద చూపించే ప్రభావాలు, చుట్టుపక్కల సమాజం వారిని లోకువగా చూస్తుందేమో అన్న భయం, అసలు పిల్లల ముందు ఎలా తలెత్తుకు తిరగాలన్న సంకోచం ఆ స్త్రీలని అతలాకుతలం చేస్తుంది. ఇటువంటి విషయాల్లో వారి స్థైర్యం, ఆత్మవిశ్వాస స్థాయిలే పనిచేస్తాయి తప్ప తర్కాలు పనిచేయవు. ఏ వైవాహిక బంధమూ లేకుండా, పరస్పర గౌరవంతో, ప్రజాస్వామిక సంస్కృతితో వ్యవహరించగల ఉన్నతులు ఎంతమంది ఉంటారు? ఎటువంటి ఆర్థిక దిగ్బంధనాలు లేని స్త్రీ-పురుష సంబంధాలు సాధ్యమా? ఇవన్నీ వారు ఎదుర్కొనే, తమకి తాము వేసుకునే ప్రశ్నలు. కొన్నింటికి సమధానాలు చెప్పి ఒప్పించలేం. అది వారి దృష్టికోణాన్ని బట్టి వ్యవహరిస్తారు.

ఒక్క విజ్ఞప్తి ఏమిటంటే మన కుటుంబ సభ్యుల్లోనో, ఇరుగుపొరుగు లోనో, సహోద్యోగుల్లోనో ఎవరైనా ఒక నిర్నిబంధ స్త్రీ-పురుష సంబంధం కోసం ధైర్యం చేస్తే మాత్రం గొప్పగా మద్దతు ఇవ్వలేక పోయినా కాల్చుకుతినే సమాజంలో మాత్రం భాగస్వాములు కావొద్దు. సమాజం అంటే ఎక్కడో లేదు. అది మనమే.

స్త్రీలు మాట్లాడాలి. ముఖ్యంగా ఒంటరి స్త్రీలు మాట్లాడాలి. స్త్రీల పోరాటమంటే ఆర్థిక స్వాతంత్ర్యం కోసమో, గృహ హింస నుండి విముక్తి కోసమో, భరణాల కోసం మాత్రమే కాక తమ శరీరం మీద హక్కుని, లైంగికాసక్తి విషయంలో స్వీయ నిర్ణయాధికారంతో సహా తమ ఉనికికి సంబంధించిన ప్రతి విషయం మీద హక్కుని కలిగి ఉండటం గురించి మాట్లాడాలి.

పీఎస్: దీనర్థం ఒంటరి స్త్రీలని ప్రేరేపించటం ద్వారా పురుషులకి ప్రయోజనం కలిగిస్తున్నామనే వారి విజ్ఞతకి వేయి దండాలు. ఇది స్త్రీల హక్కుల కోణం నుండి వెలిబుచ్చిన నా అభిప్రాయం. ఒంటరి స్త్రీల పరిస్థితుల్ని ఆదర్శాల పేరుతో అవకాశం తీసుకోవాలని చూసి, ఆ తరువాత మొహం చాటేసే పురుషుల్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాసం రాసానని తెలియచేస్తున్నాను.

-అరణ్య కృష్ణ

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు