Friday, 7 August 2026

ఆశల కోసం.. తెగిపడ్డ వేళ్లు..

‘కోరికే దుఃఖానికి మూలం’ అన్నారు బుద్ధ భగవానుడు. ఈ మాటలు వింటాం.. వదిలేస్తాం. ఎక్కడికక్కడ కొత్త కోరికలు పుడుతుంటాయి. ఆశలు రేగుతుంటాయి. కలర్ టీవీ, మొబైల్, బైక్, ల్యాప్‌టాప్.. చిట్టా ఆగే సమస్యే లేదు.. పెరగడం తప్ప!! ఆశల వెంట పరిగెత్తి ఎక్కడ ఆగుతున్నామో తెలుసా.. ఏం కోల్పోతున్నామో తెలుసా..?

మలయాళం వారు లఘు చిత్రాల‌ నిర్మాణంలోనూ ఎంత కొత్త ఒరవడి చూపించారనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ‘అంగుళీచాలితం’ అనే ఈ చిత్రం మరో అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు. 2013లోనే ఇంత గొప్ప చిత్రం మలయాళంలో వెలుగు చూసిందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత కాలం చూడనందుకు నా మీద నాకు జాలేసింది. సరే కథ వినండి..

అనగనగా కేరళలో ఎక్కడో ఓ చోట.. ఒక రోజు.. ఇద్దరు మిత్రులు ఒక పని మీద నగరపు రహదారులపై తెగ తిరుగుతున్నారు. అదేంటో మనకు ముందు అంతుపట్టదు. చివరకు వాళ్లొక హోటల్‌కి వెళ్తారు. ఆహా.. ఇంతసేపూ తిరిగింది దీని కోసమేనని తెలుస్తుంది. అక్కడికే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కొద్దిసేపట్లో అర్థమవుతుంది. అక్కడ మనిషి చేతివేళ్ల సూప్(నిజంగా.. మనిషివే) తయారు చేస్తారు. అది తాగాలని వారి ఆశ. హోటల్ యజమాని వృద్ధుడు‌. ముందు కాస్త బెట్టు చేసినా సూప్ ఇస్తాడు.

అబ్బో వాళ్లకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. ఇంకో బౌల్ కావాలని వాళ్ల ఆరాటం. మీ చేతివేళ్లు ఇస్తే దాంతో తయారు చేస్తానంటాడు యజమాని. రుచి నోరూరిస్తోంది. ఇంకా కావాలనిపిస్తోంది. సరే! ఒక్క వేలే కదా.. ఇచ్చేందుకు సిద్ధపడతారు. పదునైన కత్తి.. రెండు వేట్లు.. రెండు వేళ్లు! రక్తం చిమ్మింది.. తాళలేని నొప్పి. అయితేనేం సూప్ దొరికింది.

ఇంకా కావాలనిపిస్తోంది.. ఆశ.. ఆత్మను తినేస్తుంది. కావాలి.. కావాలి. మరో వేలు ఇస్తారా అని అడిగాడు హోటల్ యజమాని. ప్రాణం ఇచ్చేలా కోరిక దహిస్తుంటే వేళ్లు ఎంత! తీసేస్కో అన్నారు. ఇద్దరి వేళ్లు తెగాయి. సూప్ తయారైంది.. తాగారు. ఇంకా కావాలి.. ఏం భయం లేదు. మిగిలిన మూడు వేళ్లు ఇచ్చేశారు. కావాల్సినంత సూప్ తాగారు. అప్పటిదాకా ఎడమ(Left) చేయి వేళ్లే తీసుకున్నాడు హోటల్‌వాడు. కుడిచేయి వేళ్లు ఇస్తామన్నా వద్దన్నాడు. ఈ ఇద్దరు మిత్రులు ఇంటికెళ్లారు. చేతివేళ్లు లేకుండా ఏ పనీ చేయలేకపోతున్నారు. అయితే వారికి తెలియని ఓ రహస్యం హోటల్ వంటగదిలో నిక్షిప్తమై ఉంది. ఆ రహస్యమే కీలకం!!

‘అంగుళీచాలితం’ అంటే ‘వేళ్ల ద్వారా జరిగిన మోసం’. ప్రశాంత్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మూలం రంజిత్.కె.నాయర్ రాసిన కథ. వాసుదేవన్ నంబూద్రి, అరుణ్ సదానందన్, నిఖిల్ నరేంద్రన్.. ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సాగుతున్నంతసేపూ ఏదో మామూలు కథే అనిపిస్తుంది. చివరి వరకూ చూశాక విషయం బోధపడుతుంది. కోరికల వలయంలో చిక్కుకొని మనుషులు ఎంత క్రూరంగా మారుతున్నారన్న అంశాన్ని అత్యంత ప్రభావవంతంగా చూపిన చిత్రం ఇది.

సూప్ కోసం చేతి వేళ్లు ఇవ్వడం చూసేవారికి ఆశ్చర్యంగా, వింతగా అనిపించొచ్చు. కానీ ఇవాళ మార్కెట్‌లోకి వచ్చే కొత్త వస్తువుల కోసం చాలామంది చూపిస్తున్న తహతహలు అంతకన్నా తక్కువేమీ కాదు. ఉన్న ఆస్తులన్నీ అమ్మి రియల్ ఎస్టేట్‌లో పెట్టేవారు, అప్పుచేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్లు.. వాళ్లంతా ఈ కోవలోకే వస్తారు. ఆస్తి కోసం అమ్మనాన్నల్ని చంపేవాళ్లు, కోరికతో ఆడవారిని హింసించేవారు.. అందరూ తమలోని మానవత్వాన్ని, మనిషితనాన్నీ చంపుకుంటూనే ఉన్నారు. వాళ్ల ఎజెండా ఒక్కటే‌..కోరిక తీరాలి! వీటి ముందు చేతివేళ్లు అనేది చాలా చిన్న అంశం.

ఇదిగో ఈ అంశాన్నే ప్రశాంత్ విజయ్ చెప్పారు. ఆశల కోసం అన్నీ ఇచ్చేశాక మనం ఎంత ఇబ్బంది పడతామో.. మన ఆశల్ని వాడుకుని మనల్ని ఎలా మోసం చేస్తారో ‘సర్రియలిస్టిక్’ పద్ధతిలో చెప్పారు. ఇక్కడ వేళ్లు అంటే మనిషికున్న విలువలు.. ఆస్తులు.. అనుబంధాలు. కోరికల కోసం వాటిని నిర్ధాక్షిణ్యంగా నరుక్కుంటున్నారు అన్నది కథాంశం. హ్యాట్సాఫ్!! ఈ చిత్రంలో ఇంకా చాలా అంశాలున్నాయి. వాటిని మరింతగా విశ్లేషించొచ్చు. బెంగళూరు, త్రిసూర్, కలకత్తా ప్రాంతాల్లో జరిగిన ఏడు లఘు చలనచిత్రోత్సవాల్లో ఇది ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు పొందింది.

20 నిమిషాల ఈ చిత్రాన్ని తప్పక చూడండి. మధ్యలో కొంత భాగం రక్తం కనిపించే దృశ్యాలు ఉంటాయి. అవేమీ భయంకరంగా ఉండవు. ఫర్లేదు అనుకుంటేనే చూడండి. చూశాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. లేదా వ్యక్తిగత మెసేజ్ ద్వారానైనా చెప్పండి.

ఫిల్మ్ కోసం(With English Subtitles):

~ సాయి వంశి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు