Friday, 7 August 2026

స్త్రీ శరీరానికి కంచె పురుషుడా?

సినిమా గురించి చెప్పేముందు ఒక సంఘటన చెప్తా!

2018లో నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి కళింగపట్నం బీచ్‌కి వెళ్లాను. అందుకు ముందే చెన్నైలో సముద్రాన్ని చూసిన అనుభవం ఉంది. కళింగపట్నం వెళ్లే క్రమంలో మేము ఎక్కిన ఆటోలోనే ఒక అమ్మాయి, ఒకబ్బాయీ ఎక్కారు. ఇద్దరికీ పదహారు ఉంటాయి. వాళ్లు ప్రేమికులన్న విషయం వాళ్ల ముఖాలు, వాళ్ల చేతులు ఒకరినొకరు పట్టుకున్న విధానం చూసి గ్రహించాను. మాతో పాటే వాళ్లు బీచ్ వరకూ వచ్చారు. మేం స్నేహితులం చాలా సేపు అక్కడ ఉన్నాం. ఆ ఇద్దరూ ఒడ్డున కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారు. మా ఫ్రెండ్స్ అంతా వాళ్లని మర్చిపోయి ఉంటారు. నాకు మాత్రం వాళ్ల అమాయక రూపం, ఆ అమ్మాయి ముఖంలో నిశ్చింతతో కూడిన భయం ఇంకా గుర్తుంది. ఇప్పుడు వాళ్లు ఎక్కడున్నారో తెలియదు. నా ఆలోచనల్లో అయితే ఇంకా ఉన్నారు.

‘చోళ’లో దర్శకుడు చూపించిన ప్రేమికులను చూస్తే నాకు వాళ్లే గుర్తొచ్చారు. కానీ చోళ థీమ్ అది కాదు. ప్రేమ కథ కానే కాదు. మరి ఏమిటి? ఇదీ అని టక్కున చెప్పలేని ఒక విషయం. ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. సినిమా చూసేసిన చాలా మంది దాన్నొక Sexual Abuse అన్న కోణం నుంచి చూసి ఉంటారు. కానీ నేనక్కడ ఆగలేదు. కారణం సినిమా మొదట్లో నటి కె.పి.ఏ.సి.లలిత గారి గొంతులో చెప్పిన కథ. ఒక పిరికివాడైన యువరాజు తన భయాన్ని పోగొట్టుకునేందుకు అడవిలో ఒక కన్యను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆమె దగ్గరున్న తాకలేని నిధి అతనికి కావాలి. “నా నుంచి నీకేం కావాలి?” అంటుందామె. ఆ నిధి ఏమిటో తెలియని ఆ రాజు “నీ అణువణువూ కావాలి” అంటాడు. అప్పుడామె అంటుంది కదా.. “నాదేదీ నాది కాదే!” అని. అబ్బా! ఏమి కథ దేవుడా ఇది? ఈ సినిమా అంతా ఇదే! ఇంతకు మించి నాకీ సినిమా ఏమీ అర్థం కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. చేస్తే సారం తెలుస్తుంది కానీ ఈ కథ పోతుంది. ఈ కథ లేనిదే ఈ సినిమా లేదు. ఈ కథ అర్థం కాకుంటే ఈ సినిమా ఆత్మ అర్థం కాదు.

‘ప్రేమికుడితో కలిసి తెలియని ప్రదేశానికి వెళ్లిన యువతి మీద లైంగిక దాడి’ అనే Concept మాత్రమేనా ఈ సినిమా? ఇంట్లో చెప్పకుండా ఒక థ్రిల్ కోసం బయటకు వెళితే ఆమెకు జరిగే పరిణామాలా ఈ సినిమా? కాదు. మరి? స్త్రీ తన శరీరాన్ని, తననీ తనదిగా చేసుకోలేని పరిస్థితి. ఘోరమైన పరిస్థితి. లైంగిక దాడి ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి ద్వారా జరిగింది అన్నది ముఖ్యం కాదు. ఆమె శరీరం మీద దాడిని ప్రతిఘటించలేని ధోరణి ముఖ్యం. దాడిని దాడి అని అరిచి చెప్పలేని అసహాయత ముఖ్యం. తల్లికి చెప్పకుండా ఇల్లు దాటిన ఆడమనిషి పడ్డ Mental Torture తాలూకు విశ్లేషణ ముఖ్యం. ఆమె అనుమతి లేని మనిషి ఆమెపై లైంగిక దాడి చేయగా, దానికి కారణమైన ప్రేమికుడి మీద, తుదకు సమాజం మీద ఆమె చూపే అసహన జాడని చూడటం ముఖ్యం. ఈ సినిమాలో నేనది గమనించాను. అదే ఎక్కువ గమనించాను. ఏమిటి ఆమెను ఆపింది? ఏమిటి ఆమెను నిస్సహాయురాల్ని చేసిందన్న ప్రశ్నలే నా ఆలోచనలో నిండాయి.

దర్శకుడు సన‌ల్ కుమార్ శశిధరన్ ఈ సినిమా తీసేనాటికే Ozhivudivasathe Kali, Sexy Durga సినిమాలతో పాపులర్. మనం గుర్తించాల్సిన మరో విషయం.. ఆయన కవి కూడా! తన Official Websiteలో అప్పుడప్పుడూ కవితలు రాస్తూ ఉంటారు. ఆయన లాయర్. లా చదివే రోజుల్లో ABVPలో పని చేశారు. ఆ తర్వాత రాజకీయ విభేదాల కారణంగా దాన్నుంచి విడివడ్డారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనా ధోరణి ఆయన సినిమాల్లో గమినించొచ్చు. మలయాళ సినిమా దర్శకుల్లో చాలా మంది Political Ideology వారి సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా నిశితంగా గమనిస్తే అది తెలుస్తుంది.

ఈ సినిమాలో జరిగేది Rape మాత్రమే కాదు. అంతకుమించిన మానసిక దాడి. ఆమెను నిస్సహాయురాల్ని చేసిన పరిస్థితి. దాని గురించి ఒక్కొక్కరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వయసులవారీగా భేదాభిప్రాయాలూ ఉంటాయి. కానీ ‘స్త్రీ దేహం ఆమెకు సొంతం కాని పరిస్థితి’ అనే థీమ్ చుట్టూ అల్లుకున్న కథకు జేజేలు చెప్పుకుండా ఉండలేం. ముఖ్యంగా క్లైమాక్స్! తనపై దాడిని తాను ప్రతిఘటించలేని బాధలో ఆమె ఉంటే, ప్రేమికుడి వచ్చి తన యజమానిని చంపుతాడు. అంటే స్త్రీ తాలూకు ‘తాకలేని నిధి’ అయిన కన్యత్వాన్ని ఒకడు కొల్లగొడితే మరొకడు వచ్చి కాపాడాలి. లేదా పగ తీర్చుకోవాలి. ఆమె ఈ ధోరణితో విసిగింది. తన శరీర రక్షణ & భక్షణ పురుషుల చేతుల్లో ఉండడం సహించలేక ప్రేమికుణ్ని చంపేసింది. సినిమా అక్కడ ముగుస్తుంది.

నిమిష సజయన్ చాలా బాగా నటించారు. ఇందులో 16 ఏళ్ల యువతిగా నటించిన ఈ అమ్మాయే The Great Indian Kitchenలో భార్య పాత్ర చేసింది అంటే ఆశ్చర్యం వేసింది. జీపు డ్రైవర్ పాత్ర చేసిన జోజు జార్జ్ నటన నచ్చింది. అలాంటి పాత్ర అంత సెటిల్‌గా చేసినందుకు అభినందించాలి.

~ సాయి వంశి

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు