Friday, 7 August 2026

మూర్తిగారూ మీరో సినిమా చూడాలండీ!

“వారానికి డెబ్భై పని గంటలు” దేశానికి అవసరమని ఇన్ ఫోసిస్ నారాయణమూర్తి మరోసారి నొక్కి వక్కాణించారు. అన్ని పని గంటలు లేకపోవడం వల్లనే దేశం ఇలా దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నదని కూడా సెలవిచ్చారు ఆ సాఫ్ట్ వేర్ టెకీ వణిక్ ప్రముఖుడు. అన్ని పని గంటలు లేకుంటే దేశం ఎలా పేదరికాన్ని జయిస్తుందని కూడా ఆయన అడిగారు. ఆయన వేతనాల గురించి మాట్లాడకుండా కేవలం పని గంటల గురించి, ఉత్పాదకత గురించి మాత్రమే మాట్లాడటంలోనే అసలు వ్యాపార కిటుకు వుంది.

ఆయన దృష్టిలో పని చేయడమంటే సాఫ్ట్ వేర్ కంపెనీలు, పట్టణ/నగర పరిశ్రమల్లో పని చేయడమే కావచ్చు. ఇప్పుడొచ్చే జీతానికే నగరాలలో వున్న కంపెనీలు, పరిశ్రమల్లోని ఉద్యోగులు, శ్రామికులు ఎక్కువ గంటలు పని చేయాలని ఆయన ఆశిస్తుండవచ్చు. దాని వల్ల పేదరికం ఎలా తగ్గుతుంది? తక్కువ వేతనమిచ్చి ఎక్కువ పని చేయించుకోవడం వల్ల కలిగే లాభాలు ఆయా పెట్టుబడిదారులకే పోతుంది కదా! ఇది పేదలకే కాదు, సామాన్య జనానికి కూడా తీవ్రమైన నష్టం. మన దేశంలో పని చేయగలిగిన, చేద్దామనుకున్న, చేస్తామనే వారందరికీ పని దొరకడమే గగనం. ఈ ఎక్కువ గంటల పని విధానం వల్ల పని పూర్తిగా దొరకక పేదలు మరింత పేదరికంలోకే వెళతారు. పేదలకు నిజంగా మేలు జరిగి, పేదరికం నుండి బైటపడాలంటే వారికి సుస్థిర ఉపాథి, న్యాయమైన వేతనం దొరకాలి కానీ ఎక్కువ గంటలు పని చేయడం కాదు. వారి పేదరికానికి ప్రధాన సవాలు అధిక ధరలు. మూర్తి సాబ్, మీకు చేతనైతే ఈ విషయంలో ప్రభుత్వాలతో పోరాడండి.

మన మూర్తిగారికి పేదరికం గురించి, దాని కారణాల గురించి, పేదరిక నిర్మూలనా వ్యూహాల గురించి కనీసమైన అవగాహన లేదని అర్ధమవుతుంది. పేదరికానికి మూల కారణం ప్రకృతి వనరుల, ఆదాయ వనరుల అసమ పంపిణి. వ్యవసాయ దేశమైన భారత్ లో అత్యధిక శాతం భూమి తక్కువ శాతం వున్న పై కులాల వారి చేతిలో వున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పేదలు వారానికి ఆరు రోజుల చొప్పున డెబ్భై గంటలు (అంటే రోజుకి 12 గంటలు) ఎక్కడ పని చేయాలి? రోజుకి పన్నెండు గంటలు చొప్పున పని చేసినా వారికి అధిక కూలీ వస్తుందా? లేకపోతే గ్రామీణ పేదలు అదే కూలీకి ఎక్కువ పని చేయాలని మూర్తి గారు ఆశిస్తున్నారా? అసలు పని అంటూ వుంటే గ్రామీణ పేదలు పట్టణాలకు వలస ఎందుకు పోతారు?

హలో మూర్తిగారూ! ఉపాధి కోసం, పిల్లలకు నాణ్యమైన విద్య కోసం, కుటుంబానికి ఆరోగ్య వసతుల కోసం పట్టణాలకు వలస వచ్చిన పేదలు రోజుకి కేవలం ఆరేడు గంటలు మాత్రమే పని చేస్తున్నారని అనుకుంటున్నారా? మాల్స్ లో ఎన్ని గంటలు డ్యూటీ వుంటుందో మీకు తెలుసా? పెట్రోల్ పంపుల్లో, హోటళ్లల్లో, థియేటర్లలో పనిచేసే వాళ్లు ఎన్ని గంటలు పని చేస్తారో, వారికొచ్చేదెంతో ఎరుకేనా మీకు? మీకేమీ తెలియదని చెప్పటానికి కేవలం ఉదాహరణ కోసమే ఈ రెండు ప్రశ్నలు. ఈ దేశ వర్క్ ఫోర్స్ ఎన్నో వందల వేల వృత్తుల్లో, ఎన్నో లెక్క లేనన్ని గంటలు పని చేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తూనే వున్నది. ఇప్పుడు టెకీలు కూడా రోజుకి పది నుండి పన్నెండు గంటల వరకు పని చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం అంటే అది అనంతం ఇంక! ఇంతకంటే ఎక్కువ చేస్తే మాత్రం పనిలో నాణ్యత వుంటుందా? మూర్తిగారూ మీకు ఎవరైనా బలవంతంగా అయినా చార్లీ చాప్లిన్ సినిమా “మొడర్న్ టైంస్” చూపిస్తే బాగుండు! అందులో మీబోటి కేరక్టర్ ఒకటి వుంటుందిలెండి ఆ సినిమాలో. మీరు తప్పక చూడాల్సిన సినిమా అది.

రోజుకి వుండేదే ఇరవై నాలుగ్గంటలు. అందులో పన్నెండు గంటలు పని చేసి, ఏడు గంటలు నిద్రపోతే ఇంక మిగిలిన కొద్ది గంటలు కుటుంబంతో గడుపుతూ పిల్లల బాగోగులు, వారి చదువులు, ఆరోగ్యం వంటి ఇతర సమస్యలు అడ్రెస్ చేయడానికి పరిమితం చేయాలా? మూర్తిగారూ ఈ దేశపు వర్క్ ఫోర్స్ అంతా మీ వంటి పెట్టుబడి బాబుల కోసం పుట్టిందనుకుంటున్నారు కామోసు! పన్నెండు గంటలు పని చేసొచ్చిన స్త్రీలు కనీసం తమ ఆరోగ్యం గురించైనా పట్టించుకోగలుగుతారా? మీకు అంటే మీ బంగళాల్లో గిన్నెలు తోమేవారి దగ్గర నుండి తోటమాలుల వరకు నౌకర్లు, చాకర్లు వుంటారు. మామూలు జనంకి ఒక్క పూట ఇంటి పని తప్పడమే మహా విలాసం మూర్తి బాబూ!

ఈ దేశ జాతీయ సంపదలో 42.5 శాతం కేవలం ఒక్క శాతం ధనిక ప్రజల చేతిలో వుండగా దేశ జనాభాలో 50 శాతం మంది దగ్గర కేవలం 2.8 శాతం సంపద వుంది మూర్తిగారూ! పైన వున్న 1 శాతం మంది సంపద గత సంవత్సరంలో 46 శాతం పెరిగింది. పేదరికానికి ముఖ్య కారణం మీ వారానికి డెబ్భై గంటలు అమలు చేయకపోవడమా లేక అసమ సంపద, వనరుల పంపిణీనా వణిక్ ప్రముఖా?
***

వేలాదిమంది ఉద్యోగుల కష్టంతో ఎలాగోలా డబ్బులొచ్చి పడి, సంపదలు పెంచుకొని ఇష్టం వచ్చినట్లు భర్త సూత్రీకరణలు చేస్తే, భార్యేమో దేశం మొత్తం ప్రజలు విలాసాల్లో మునిగి తేలుతున్నట్లు సింప్లిసిటీ గురించి ప్రవచనాలు చెప్పడానికి బైలుదేరుతుంది. ఆయనదేమో దురాశ. ఈవిడదేమో హిపోక్రసీ. పేదరికం పోవాలని నిజాయితీగా సంకల్పిస్తే జనాల్ని ఆడిపోసుకోవడం కాకుండా ప్రభుత్వాలతో కొట్లాడాలని, రాజకీయ/ఆర్ధిక విధానాల్ని ప్రశ్నించాలని ఆ భర్తకీ; నిరాడంబరత అంటే నేల మీద కూచొని కత్తిపీటతో కూరలు తరగడం ద్వారా ప్రాచుర్యాన్ని, పరపతినీ పెంచుకోవడం కాదనీ, విపరీత సంపదల పోగుకి దూరంగా వుండటమేనని ఆ భార్యకి ఎవరైనా చెబితే బాగుండును కదా!

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు