Friday, 7 August 2026

రైలు హైజాక్ చెప్పే నిజాలు!

పాకిస్తాన్ లోని క్వెట్టా నుండి పెషావర్ కి నాలువందల పైచిలుకు ప్రయాణీకులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బి.ఎల్.ఏ.) సభ్యులు హైజాక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఎందుకంటే సాధారణంగా విమానాలే హైజాక్ కి గురవుతుంటాయి. విమానంతో పోలిస్తే రైలు సైజు చాలా పెద్దది. పైగా రైలు కంపార్ట్మెంట్లుగా విడిపోయి వుంటుంది. మొదటి నుండి చివరి వరకు ఒకే చూపులో కవర్ చేయడం కుదిరే పని కాదు. కానీ (బి.ఎల్.ఏ.) ఆ పనిని అత్యంత పకడ్బందీగా, సమర్ధవంతంగా నిర్వహించింది. అదీ పాక్ ఆర్మీ సభ్యులు అధికంగా ప్రయాణించిన రైలుని హైజాక్ చేయడమంటే మాటలు కాదు. ఎలాంటి సందేహాలకూ తావు లేకుండా బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఈ హైజాక్ కి బాధ్యత వహించింది. తామే ఈ పని చేశామని ప్రకటించింది.

క్వెట్టా నుండి పెషావర్ వెళ్లే రైలు మార్గమంతా పర్వత ప్రాంతం. మొత్తం 17 టన్నెళ్ల గుండా రైలు వెళుతుంది. ఈ ప్రాంతంలో బోలాన్ పాస్ దగ్గర రైలు నిదానంగా వెళుతుంది. ఎనిమిదవ టన్నెల్ దగ్గర ముందుగా పట్టాల్ని పేల్చేసి, రైలు మీద కాల్పులు జరిపారు. చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఈ రైలులో బలోచిస్తాన్ లో విధి నిర్వహణలు నిర్వర్తించే ఆర్మీ సిబ్బందే ఎక్కువగా ఎక్కుతుంటారు. అంటే ఈ ట్రెయిన్ హైజాక్ ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్ధమవుతుంది.

నాలుగు వందల నలభై మంది ప్రయాణీకులలో 182 మందిని మాత్రమే బందీలుగా తీసుకున్నారు. విడిచిపెట్టబడ్డవారు బలోచిస్తాన్ కి చెందిన వారు. గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రయాణీకుల్ని చెక్ చేసి, వారిలో పంజాబీల్ని, సెక్యూరిటీ సిబ్బందిని వేరు చేసి వారిని కిడ్నాప్ చేసినట్లుగా ప్రకటించారు. బందీలు మొత్తం రైల్లోనే వున్నారా లేదా వారిని చుట్టుపక్కల పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారా అనేది తెలియదు. అసలు మిలిటెంట్లే చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ప్రయాణీకుల్ని తీసుకెళ్లారని, వారి వద్దనున్న వాకీ టాకీలతో సమన్వయం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

సూసైడ్ బాంబ్ జాకెట్లు తొడుక్కున్న తీవ్రవాదులు రైల్లో ప్రయాణీకుల పక్కనే కూర్చున్నారు. ఆ రకంగా వారిని రక్షణ కవచంగా వాడుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు పాక్ ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చారు. ఎటువంటి సైనిక చర్య చేపట్టినా వినాశకర పరిణామాలు వుంటాయని మిలిటెంట్లు హెచ్చరించారు.

తాజా వార్త: మిలిటెంట్లపై పాక్ భద్రతా దళాలు దాడులు జరిపి, మొత్తం 33 మంది మిలిటెంట్లను ఖతం చేసి ప్రయాణీకులందర్నీ రక్షించినట్లు పాక్ అధికార వర్గాలు ప్రకటించాయి. 21మంది ప్రయాణీకులతో పాటు నలుగు పారా మిలిటరీ సనికులు ఈ హైజాక్ సందర్భంగా చనిపోయారని పాక్ సైన్యం తెలిపింది.

మనం ఏమనుకున్నా మనకి కాశ్మీర్ ఎలాంటి, ఎంతటి సమస్యో పాకిస్తాన్ కి బలోచిస్తాన్ అంతే పెద్ద సమస్య. అక్కడ కూడా బలోచిస్తాన్ వేర్పాటువాదం బలంగా వుంది. కాశ్మీర్ విషయంలో మనం పాకిస్తాన్ ని ఎలా నిందిస్తామో అచ్చు అలానే బలోచిస్తాన్ విషయంలో పాక్ భారత్ ని నిందిస్తుంటుంది. స్వాతంత్ర్యానికి పూర్వం పాకిస్తాన్ లో వున్న నాలుగు ప్రావిన్సెస్ లో బలోచిస్తాన్ ఒకటి. ఖైబర్ ఫక్తూన్ఖ్వా పఠాన్స్ (ఎక్కువగా ట్రైబల్ గ్రూప్స్), పంజాబ్ లో పంజాబీస్, సింద్ లో సిందీస్, బలోచిస్తాన్లో బలోచ్లు నివసిస్తారు. ఇందులో బలోచిస్తాన్ పాకిస్తాన్ లో కలవడానికి సుముఖంగా లేరు. గత 78 ఏళ్లుగా వారు వివిధ స్థాయిలలో ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ తో సాయుధ పోరాటలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ప్రత్యేక బలోచిస్తాన్ ఉద్యమంపై పాక్ భయంకర నిర్బంధం విధించింది. గత ఒక్క దశాబ్దకాలంలోనే పదివేలకు పైగా అదృశ్య మరణాలు సంభవించాయి.

100 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ సిపెక్ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) అమలుతో సంక్షోభం ముదిరింది. అందులో భాగంగా బలోచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ని చైనీస్ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషీయేటివ్ లో భాగంగా అభివృద్ధి చేశారు. దానివల్ల బలోచిస్తాన్ కి ఎలాంటి ఉపయోగం లేకపోగా బలోచ్ల ఫిషింగ్ కి ఆటంకం ఏర్పడింది. అందువల్ల సిపెక్ అగ్నికి ఆజ్యం చేకూర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బి.ఎల్.ఏ. తమ ఉనికి మీద పాక్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిఘటనగా రైల్ హైజాక్ కి పూనుకున్నది.
**

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మతం ఒక్కటే ఒక దేశ ప్రజలనందరినీ ఒక్కటిగా వుంచలేదు. పాకిస్తాన్ లో వున్న నాలుగు ప్రావిన్సెస్ ప్రజలు ఇస్లాం నే ఆచరిస్తారు. కానీ ఆ ప్రజల మధ్య ఐక్యత లేదు. ప్రతిచోట పంజాబీల ఆధిపత్య ధోరణి జాతుల స్పృహని రెచ్చగొట్టింది. అందుకే మతం కంటే జాతి, భాష, సంస్కృతులే పౌరులకి ముఖ్యంగా వుంటుంది. ఒకే మతంలో అనేక జాతులు, ఒకే జాతిలో అనేక మతాలు ఇమిడి వుండొచ్చు కానీ ఏ కారణం చేతనైనా ఒక జాతిని మరొక జాతి, ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతం తొక్కిపెట్టాలని చూస్తే జరిగేది అంతర్యుద్ధాలే. ఎందుకంటే ఖచ్చితంగా మతం కంటే జాతికి సంబంధించిన భావనలే మానవాళికి వున్న అతి పెద్ద సెంటిమెంటు. ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే భాష జాతుల మధ్య విభేదాల్ని పరిష్కరించలేవు ఏనాటికీ!

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు